విశాఖపట్టణం: మొద్దు శ్రీను  హత్య కేసులో దోషి  ఓం ప్రకాష్ సోమవారం నాడు కేజీహెచ్‌  ఆసుపత్రిలో మృతి చెందాడు

టీడీపీ నేత పరిటాల రవి కేసులో దోషి మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాష్ మరణించాడు. విశాఖపట్నంలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతూ అతను మరణించాడు. గత కొంత కాలంగా అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు.

మొద్దు శ్రీనును ఓం ప్రకాష్ జైలులోనే చంపాడు. 2016 నుంచి ఓంప్రకాష్ విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉంటున్నాడు.

పరిటాల రవి హత్య కేసులో జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను హత్య కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాష్ కు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో కోర్టు మొత్తం 23 మందిని విచారించింది.  ఈ కేసులో 2010 నవంబర్ 10వ తేదీన  ఓం ప్రకాష్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. 

ఈ కేసులో తనను అందరూ కలిసి ఇరికించారని ఈ తీర్పు వెలువడిన తర్వాత ఒం ప్రకాష్ ఆరోపించారు. మొద్దుశీనును 2008 నవంబర్ 9వ తేదీనే జైల్లోనే ఓం ప్రకాష్ చంపాడు. రామకోటి రాసుకొంటున్న సమయంలో తనను డిస్టర్బ్ చేస్తే డంబుల్ తీసుకొని మొద్దు శీనును హత్య చేసినట్టుగా ఓం ప్రకాష్ చేసిన ప్రకటన అప్పట్లో పెద్ద సంచలనం కల్గించింది.

మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవిని హత్య చేసిన కేసులో జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. వేరే కేసులో శిక్షను అనుభవిస్తున్న ఓం ప్రకాష్ కూడ ఇదే జైల్లో ఉన్నాడు.  జైల్లోని ఒకే బ్యారక్ లో వీరిద్దరూ ఉన్నారు.

2016 నుండి విశాఖపట్టణం సెంట్రల్ జైల్లో ఓం ప్రకాష్ ఉంటున్నాడు. పరిటాల రవి హత్య కేసులో కొందరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.