రెట్రోసా ఎలక్ట్రిక్ స్కూటర్: ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు గాను ఎలక్ట్రిక్ వాహనాలపై ఆధారపడాల్సిన అవసరం నెలకొందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. విజయవాడలో సోమవారం నాడు రెట్రోసా ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆయన ప్రారంభించారు.
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు Venkaiah Naidu అన్నారు. మన వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగా electric వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో Avera ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త వేరియంట్ రెట్రోసాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వాతావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపు మేరకు ఆ దిశగా అవేరా సంస్థ అడుగులు వేయడం శుభపరిణామమన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ఎంచుకున్నందుకు అవేరా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. క్లీన్, గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా అవేరా వ్యవస్థాపకుడు, సీఈవో డా. రమణ కో ఫౌండర్ చాందిని చందన నాంది పలికారని వెంకయ్య నాయుడు అన్నారు. డా. రమణ మాట్లాడుతూ అధునాతన ఫీచర్లతో రూపొందిన రెట్రోసా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు.
బ్లూటూత్ ను అనుసంధానించడం ద్వారా బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ శాతం వోల్టేజ్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలోనే ఈ శ్రేణి వాహనాల్లో రెట్రోసా అత్యధిక వేగాన్ని కలిగి ఉందని చెప్పారు. అవేరా ఇప్పటికే యూరప్, ఏషియా పసిఫిక్ దేశాలకు వాహనాల ఎగుమతి చేస్తోందని వివరించారు.
2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 అవేరా పాయింట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోందని డా. రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో అవేరా ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.