హైదరాబాద్‌: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చేతులు కలిపిన ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసుపై పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కాంగ్రెసుకు రాజీనామా చేశారు. మౌలిసిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ టీడీపీతో కలవడాన్ని నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

తన రాజీనామా లేఖను శుక్రవారం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వసంత కుమార్ మెయిల్ ద్వారా పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 

వట్టి వసంతకుమార్ ను బుజ్జగించడానికి కాంగ్రెసు నేతలు రంగంలోకి దిగారు. వట్టి వసంతకుమార్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, ఏ పార్టీలో ఆయన చేరబోతున్నారు అనే విషయాలపై స్పష్టత లేదు. అయితే వసంత్ కుమార్ జనసేన లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అయితే త్వరలోనే ఆయన తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు.