గుంటూరు: అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే జగన్ సర్కార్ ఏపి హైకోర్టు చేత 52సార్లు చివాట్లు తిన్నదని...ఈ పాలకుల అసమర్థతకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని తెలుగుదేశంపార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలతో వైసిపి సర్కార్ అభాసుపాలవడం సిగ్గుచేటని... తాజాగా 
ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా ప్రవేశపెట్టేందుకు తెచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయడం జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టని విమర్శించారు.  

న్యాయస్థానాల్లో వైసీపీ ప్రభుత్వం వరుస ఎదురుదెబ్బలు తిన్నా పాలకులకు బుద్ధి రావడం లేదని... పరిపాలనలో ఎలాంటి మార్పు రావడం లేదని అన్నారు.  గతంలో బస్సులు జాతీయం చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు చేసిన సూచనకే అవమానంగా భావించి నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పదవికి రాజీనామా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ హైకోర్టు ఎన్నిసార్లు తప్పుబట్టినా జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ  పాలనలో నైతిక విలువలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. 

ప్రజావ్యతిరేక నిర్ణయాలతో జగన్ సర్కార్ అభాసుపాలవుతున్నప్పటికీ పాలనను సరిద్దుకోలేకపోవడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కోర్టు చివాట్లు తినడం  జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.  10 నెలల కాలంలో 52 చివాట్లు తినడం జగన్ పాలనలో కనీస అవగాహన లేమిని  స్పష్టంగా కనపడుతోందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందన్నారు.  

గతంలోనూ అనేకసార్లు న్యాయస్థానం మొట్టికాయలు వేసినా జగన్ దులుపుకు వెళ్ళారని... దీన్ని రాష్ట్ర ప్రజలే తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో పోలీసుల భారీ కవాతు, మహిళను బూటు కాలితో తన్నడం, పోలవరం రివర్స్ టెండర్స్ విషయంలో, టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత తగ్గింపుపైనా హైకోర్టు మొట్టికాయలు వేయలేదా అని ప్రశ్నించారు. 

పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై, రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధించడం, రాజధాని భూములను ఇతరులకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడం,  రాజధాని తరలింపుపైనా మొట్టికాయలు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. గతంలో వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించకపోవడంపై చివాట్లు తినలేదా అని వర్ల రామయ్య నిలదీశారు.