గుంటూరు: విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనలో ముద్దాయిలైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని...  గ్రామస్తులు ఇళ్ళు వదిలి రోడ్డున పడటానికి కారకులైన వారికి జగన్ ప్రభుత్వం ఎందుకు మద్దతు పలుకుతోందంటూ టిడిపి సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. గ్యాస్  లీకేజీ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం  తప్పు చేయలేదని చెప్పడానికి  ప్రభుత్వం ఆతృత పడుతోందని... ముద్దాయిని సంతోష పెట్టేలా దర్యాప్తు చేస్తోందన్నారు. ముద్దాయికి ఒకింత నష్టం జరగకూడదన్న ప్రభుత్వ వైఖరి బాధాకరమన్నారు రామయ్య.

''ఎల్జీ పాలిమర్స్ పై ఎందుకు సానుభూతి చూపుతున్నారో జగన్ సమాధానం చెప్పాలి.  విశాఖ వెళ్ళివచ్చినప్పటి నుంచీ జగన్ పై ప్రజలంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన వివరాలు తెలిసిన నాడే ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని భావించిన ప్రజలకు నిరాశ మిగిల్చారు.    ఫ్యాక్షనిస్టులు హత్యకు పాల్పడితే రాజీ చేసిన చందంగా జగన్ తీరు ఉంది'' అని విమర్శించారు. 

''12 మంది ప్రాణాలు కోల్పోయి వందల మంది అనారోగ్యంతో బాధపడుతుంటే తప్పు చేసిన ముద్దాయిని ప్రభుత్వం అరెస్ట్ చేయడంలో మీనమేషాలు లెక్కించడానికి కారణమేమిటి. ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ  అధికార్లు ఎల్జీ పాలిమర్స్ లో సంఘటన జరిగిన సమయంలో బాయిలర్స్ లో  20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సిన చోట 150 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు తెలిపారు. అయినా ఆ కంపనీ యాజమాన్యంపై ఎందుకు రక్షణ చర్యలు తీసుకోలేదు. గ్యాస్ లీక్ కావడంలో  నిర్లక్షం చేసిన కారణంతో  ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి'' అని డిమాండ్ చేశారు. 

''ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై 12 చనిపోవడానికి దారి తీసిన  సంఘటనలో అందరి వేళ్ళూ జగన్ వైపే చూపుతున్నాయి. భయపడాల్సిన ముద్దాయిలకు ప్రభుత్వం అభయమిస్తోంది. పలువురి జీవితాలు అంధకార బంధురమయ్యాయి.  గ్యాస్ ప్రభావానికి లోనైన కొంతమందికి చెవులు పనిచేయడం లేదు, కళ్ళు కనబడటం లేదు.  మరికొందరు లివర్, మెదడు దెబ్బతిని పక్షవాతం వస్తుందని బాధపడుతున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''జగన్  కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్యాక్టరీకి ఎల్జీ పాలిమర్స్ కు అనుబంధంగా ఉందా?  ఎల్జీ నుంచి ముడి సరుకు కొంటున్నారా?  ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం జగన్ కు ముందే తెలుసా? గతంలోనే సన్నిహిత  సంబంధాలున్నాయా? ఎందుకింత  ప్రేమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

''విశాఖ దుర్ఘటనలో తెదేపా ప్రభుత్వంపై నెపం నెట్టాలని చూస్తే నమ్మని ప్రజలు అంతా మీరే చేశారని విశ్వసిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి. ఈ సంఘటన నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే హడావుడీగా కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించారన్నది నిజం కాదా? ఎల్జీ పాలిమర్స్ పై కేసును మూసివేయమన్నట్లున్న ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉంది. మంత్రులపై ప్రజలకు నమ్మకం లేదు'' అన్నారు. 

''మీ నెంబరు 2గా వ్యవహరించే వ్యక్తి ఏ  కలుగులో దాక్కున్నాడు. ఆయనే కదా ఎల్జీ ప్రారంభానికి  అనుమతులిచ్చారట. పెద్దమొత్తంలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నుంచి విజయసాయి రెడ్డి ట్రస్ట్ డొనేషన్ తీసుకున్నారట నిజమా?  కోటి ఇచ్చి బాధితుల నోళ్ళు మూయిస్తారా? ఎల్జీ యాజమాన్యాన్ని కస్టడీలోకి ఎందుకు తీసుకోలేదో సీఎం సమాధానం చెప్పాలి.  ఇటివంటి సంఘటన జరిగితే సంబంధిత యాజమాన్యాన్ని అదేరోజు కస్టడీలో పెట్టేవారు. ఇక్కడ ముద్దాయిలు  యధేచ్ఛగా సీఎంతో మాట్లాడుతారు, స్వేచ్చగా తిరుగుతారు'' అన్నారు. 

''12 మంది ప్రాణాలకు రూ. 12 కోట్లిచ్చి కొనేశారా? ప్రజల ప్రాణాల విలువ  రూ. 12కోట్లా?  ఇక కేసు గురించి అడగవద్దా? రాష్ట్రంలో నేరం చేసి ఇంత డబ్బు పడేస్తే కేసులు ఉండవా? తప్పు చేసే నేరస్తులను శిక్షించే బాధ్యతను ముఖ్యమంత్రి విస్మరించడం తగదు. నేరస్తులకు కొమ్ముకాస్తున్నట్లు వైకాపా ప్రభుత్వం ఎటుపోతోంది?'' అని ప్రశ్నించారు. 

''ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో దర్యాప్తు జరగడం లేదు. ఆనాడు భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విదేశాల్లో ఉన్న ముద్దాలను జుట్టు పట్టుకుని లాక్కొచ్చి అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ సమయంలో కార్మికులను ఏమీ కానీ వ్యవహారంలో అనుమానాలను నివృత్తి చేయడం  నుంచి పోలీసు దర్యాపు ప్రారంభం కావాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వమా? రాచరికప్రభుత్వమా?వైకాపా ప్రభుత్వమా?  ముఖ్యమంత్రి జగన్  స్పష్టం చేయాలి? ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రమాదానికి కారణాలపై నిజానిజాలు  వెలికి తీయడానికి దర్యాప్తును వేగవంతం చేయాలి'' అని రామయ్య కోరారు.