విజయవాడ: వంగవీటి రాధా కృష్ణ రాజకీయాల్లో ఇంకా తప్పటడుగులు వేస్తున్నారా...?లేక తెలిసే చేస్తున్నారా...?గత అనుభవాలను కూడా పట్టించుకోకుండా ఒటెద్దు పోకడలతో ముందుకు పోతున్నారా...?ఎన్నికలకు ముందు పార్టీ మారిన ప్రతీసారి ఓటమి పాలవుతున్నా ఇంకా ఆ విషయాన్ని రాధా గ్రహించలేకపోతున్నారా...?అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 

గతంలో రెండు పర్యాయాలు ఇలానే ఎన్నికలకు ముందు పార్టీ మారి దెబ్బతిన్న రాధాకృష్ణ ఈసారి అదే నిర్ణయం తీసుకోవడం ఆయన అనుచరులను బాధిస్తోంది. వంగవీటి రాధాకృష్ణ తండ్రి వంగవీటి మోహన్ రంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

ఆ తర్వాత ఆయన సతీమణి రత్నకుమారి 1989లో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది శాసన సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పదేళ్లకు మళ్లీ రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

రాధాకృష్ణ రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. 2004 ఎన్నికలకు ముందే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాధాకృష్ణకు సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. 

ఆ తర్వాత 2009లో ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి పీఆర్పీలోకి జంప్ అయ్యారు. చిరంజీవి ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు పార్టీ పెడితే ఈయన కొద్ది నెలల ముందు పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ ఘోరంగా ఓటమి పాలయ్యారు. 

ఇకపోతే 2014 ఎన్నికలకు ముందే వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారారు. ప్రజారాజ్యం పార్టీని పీఆర్పీలో విలీనం చెయ్యడంతో కొంతకాలం స్తబ్ధుగా ఉన్న రాధా ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాదాపు 15వేల ఓట్లతో పరాజయం పాలయ్యారు. 

తాజాగా 2019లో కూడా పార్టీ మారుతున్నారు. ఇన్నాళ్లు వైసీపీలో కష్టపడి బలమైన క్యాడర్ ను సంపాదించుకున్న రాధాకృష్ణ ఎన్నికలకు మందు పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాధా పార్టీ మారిన రెండు పర్యాయాలు ప్రతిపక్ష పార్టీలోకి అని చెప్పుకోవాలి. 

2009లో అధికార పార్టీ వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2014లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. సైకిల్ ఎక్కనున్నారు. రెండు సార్లు ఆయన పార్టీలు మారుతూ దెబ్బతింటున్నా మళ్లీ అదే బాటలో పయనించడాన్ని ఆయన అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. 

అయితే రాధాకృష్ణ తీసుకున్న నిర్ణయం ఏమేరకు ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. రాధా ఈ ఎన్నికల్లో గెలిచి తనకు సెంటిమెంట్ గా వస్తున్న పరాజయాలను తిప్పికొడతారా లేక మళ్లీ సెంటిమెంట్ గెలుస్తుందా అన్నది మరో నాలుగు నెలలు ఓపికపడితే గానీ చెప్పలేం. 

ఇకపోతే ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలోకి మారిన రెండుసార్లు ఓటమిపాలైన వంగవీటి రాధా ఈసారి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. మరి ఈ పరిణామం ఏ మేరకు ఉపకరిస్తుందో అన్నది వేచి చూడాలి.