టీడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ టిడిపిలోకి ఆహ్వానించడంపై కూడా వంశీ స్పందించారు.
విజయవాడ/ శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలకు ఆ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరగవచ్చునని ఆయన అన్నారు. నడుముకు రాకట్ కట్టుకుని ఆకాశానికి ఎగరవచ్చునని, గోదావరి నదిలోనూ దూకవచ్చునని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సెక్షన్ 143, 31 అమలులో ఉన్నప్పుడు పోలీసులు నియంత్రించడం పరిపాటి అని ఆయన అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని, ఎమ్మార్పీయస్ నేత మందక్రిష్ణ మాదిగను నియంత్రించలేదా అని ఆయన ప్రశ్నించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టిడిపిలోకి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడం పెద్ద జోక్ అని ఆయన అన్నారు. టిడిపిని జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ స్థాపించారని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకుని మళ్లీ చంద్రబాబు ప్రజలను ఓట్లు అడుగుతారని ఆయన అన్నారు. చంద్రబాబును ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తరిమికొడుతారని ఆయన అన్నారు.
గత ఎన్నికల్లో టిడిపికి ప్రజలు 23 సీట్లు మాత్రమే ఇచ్చి మూలన కూర్చోబెట్టారని అప్పలరాజు వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కరెంట్ చార్జీలు తగ్గించాలని అడిగితే కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు శాసనసభ్యులకు ప్యాకేజీలు ఇచ్చి తనవైపు లాక్కున్నారని ఆయన గుర్తు చేశారు.
ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు వేధించారని ఆయన అన్నారు. దమ్ముంటే తేల్చుకుందాం రండని చంద్రబాబు తొడ కొడుతున్నారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావని ఆయన అన్నారు.
చంద్రబాబు తన హయాంలో ఒక్క మంచి పని కూడా చేయలేదని, ప్రజలకు ఏ విధమైన మేలూ చేయలేదని, అలా చేసి ఉంటే చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు. సైకో చంద్రబాబును ప్రజలు తరిమికొడుతారని అప్పలరాజు వ్యాఖ్యానించారు. పిచ్చి పిచ్చి మాట్లాడితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు.
