తెలంగాణలో అంబేద్కర్ కు జరిగిన అవమానాల గురించి ఏపీ ప్రజలకు కూడా తెలియాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు.  గురువారం ఆయన ఏపీ పర్యటనకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో  స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కి జరిగిన అవమానం గురించి తాను ఏపీ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్లు చెప్పారు. శుక్రవారం కాకినాడలోని ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తాను ధర్నా చేయబోతున్నట్లు వీ హనుమంతరావు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘం తీరుపై కూడా విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం ఓవరాక్షన్ చేస్తోందని మండిపడ్డారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పెద్దలు.. ఎవరిపై దాడిచేయమంటే వారిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలనూ మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు.