గుర్తుతెలియని దుండగులు వందలాది నాటుకోళ్లను కొట్టిచంపిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. 

పల్నాడు : కోళ్ల ఫారం మీదపడి వందలాది నాటుకోళ్ళను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా కొట్టిచంపారు. దీంతో ఫారం నిర్వహిస్తున్న మహిళకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం కొండెమోడు గ్రామంలో లక్ష్మీ అనే మహిళ నాటు కోళ్లను పెంచుతోంది. కోళ్ల ఫారంలో పనులతో పాటు కాపలా వుండేందుకు ఓ వ్యక్తిని నియమించుకుంది. ఇలా గతకొన్ని నెలలుగా కోళ్లను జాగ్రత్తగా పెంచి తాజాగా వాటిని అమ్మడానికి సిద్దమయ్యింది. నాటుకోళ్లను అమ్మనున్నట్లు... కొనేందుకు ఆసక్తి చూపేవారు తమను సంప్రదించాలని గ్రామంలో చాటింపు కూడా వేయించారు.

వీడియో

అయితే శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు అమ్మకానికి సిద్దంగా వున్న నాటుకోళ్లపై దాడికి తెగబడ్డారు. కర్రలతో కోళ్లఫారంలోకి చొరబడ్డ దుండగులు కోళ్లు అన్నింటినీ కొట్టిచంపారు. ఇలా వందలాది కోళ్లను చంపి దాదాపు 2 లక్షల రూపాయల వరకు నష్టం చేసారు.

ఇవాళ(ఆదివారం) ఉదయం కోళ్లన్నీ చనిపోవడం చూసి నిర్వహకురాలు లక్ష్మి లబోదిబోమన్నారు. కొన్ని నెలలుగా ఎంతో కష్టపడి కోళ్లను పెంచామని... తీరా అమ్ముకుందామనే సమయంలో ఇలా గిట్టనివారు ఎవరో దారుణానికి పాల్పడ్డారని అంటున్నారు. కోళ్లన్ని చనిపోయి తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలని... ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని లక్ష్మీ కోరుతోంది.