శ్రీకాకుళం జిల్లా పలాస మండల టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి వైసీసీ నేతల పనేనంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. మండల టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆయన తన కారులో పని మీద వెళ్తుండగా.. రామకృష్ణాపురం వద్ద మాటు వేసిన దుండగులు ఆయనపై దాడికి దిగారు. ఈ ఘటనలో లక్ష్మణరావుకు తీవ్రగాయాలు కాగా.. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న టీడీపీ నేత గౌతు శిరీష, ఇతర నేతలు, కార్యకర్తలు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో లక్ష్మణరావును అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడి వైసీసీ నేతల పనేనంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఉద్రిక్త పరిస్దితుల నేపథ్యంలో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
