అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు భద్రత కల్పించేందుకు కేంద్రం అంగీకరించింది. ఎంపీకి వై కేటగిరి కింద భద్రతను కల్పించాలని నిర్ణయం తీసుకొంది. నాలుగైదు రోజుల్లోనే  రఘురామకృష్ణంరాజుకు భద్రత కల్పించే అవకాశం ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విమర్శలు చేశారు. ఈ విషయంలో ఎంపీ కూడ వారిపై ప్రత్యారోపణలు చేశారు.
ఈ తరుణంలో మంత్రి చెరుకువాడ రంగనాథరాజుతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ  రఘురామకృష్ణంరాజుపై  పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. అంతేకాదు ఎంపీ దిష్టిబొమ్మలు దగ్దం చేశారు.

దీంతో రక్షణ కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణంరాజు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖకు ఆయన లేఖ రాశారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని , హోం సెక్రటరీని కూడ ఆయన కలిశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కూడ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 

కేంద్ర ప్రభుత్వం కూడ రఘురామకృష్ణంరాజుకు భద్రత కల్పించేందుకు సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం. వై కేటగిరి కింద రఘురామకృష్ణంరాజుకు భద్రత కల్పించనున్నారు. రెండు మూడు రోజుల్లో సెక్యూరిటీ సిబ్బంది నర్సాపురం ఎంపీ వద్దకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.