రాజమండ్రి: మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే తన మంత్రివర్గంలో చేరాలని జగన్ ఉండవల్లిని ఆహ్వానించినట్లు చెబుతున్నారు అందుకు ఉండవల్లి సూత్రప్రాయంగా అంగీరించినట్లు సమాచారం.  రాష్ట్రాభివృద్ధి కోసం సీనియర్ మేధావుల అవసరం చాలా ఉందని, అందుకు తనతో చేతులు కలపాలని జగన్ ఉండవల్లితో అన్నట్లు చెబుతున్నారు. 

జగన్ ఆహ్వానాన్ని ఉండవల్లి మన్నించినట్లు ప్రచారం సాగుతోంది. ఉండవల్లి వంటి అనుభవజ్ఞులు శాసనసభలో ఉండడం అవసరమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉంటే ఎదుర్కోవడానికి ఉండవల్లి వంటి సీనియర్లు, మాటకారులు ఉపయోగపడుతారని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఉండవల్లి అత్యంత చాకచాక్యంగా వ్యవహరిస్తారు. విషయ పరిజ్ఞానం ఆయనకు అందుకు ఎంతో తోడ్పడుతుంది.