పోలీస్ స్టేషన్ లో దాచిన భారీగా వెండి, నగదును ఇద్దరు కానిస్టేబుల్స్ దొంగిలించిన ఘటన కర్నూల్ పోలీస్ స్టేషన్లో వెలుగుచూసింది.
కర్నూల్ : పోలీసులే దొంగలుగా మారి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే దొంగతనానికి పాల్పడిన సంఘటన కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. రెండేళ్ళ తర్వాత ఈ దొంగతనం గురించి బయటపడటంతో సదరు పోలీస్ దొంగలను అరెస్ట్ చేసి స్టేషన్లో చోరీకి గురయిన సొత్తును రికవరీ చేసారు.
కర్నూల్ ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుతం కౌతాళం పోలీస్ స్టేషన్ లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కోడుమూరులో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రమణబాబు గతంలో కర్నూల్ అర్భన్ పోలీస్ స్టేషన్లో పనిచేసారు. వీరు ఇక్కడ పనిచేసే సమయంలో (2021 జనవర్ 27న) తమిళనాడు వ్యాపారి భారతి గోవిందరాజు భారీగా నగదు, వెండితో పట్టుబడ్డాడు. అతడి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు కర్నూల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు.
అయితే ఏడాది గడిచినా ఈ సొత్తును తీసుకోడానికి గోవిందరాజు రాకపోవడంతో వాటిపై కానిస్టేబుల్స్ అమరావతి, రమణబాబు కన్నుపడింది. పోలీస్ స్టేషన్ నుండి వాటిని దొంగిలించేందుకు అదునుకోసం చూస్తుండగా 2022 మే 24న కర్నూల్ పోలీస్ స్టేషన్లో దాచిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయడానికి ఉన్నతాధికారులు పూనుకున్నారు. ఇదే సరైన సమయంగా భావించిన ఇద్దరు కానిస్టేబుల్స్ వెండి, నగదు దొంగిలించారు.
Read More వివాహితతో సహజీవనం, నిత్యం మద్యం తాగి వేధింపులు.. గొంతుకోసి చంపిన ప్రియురాలు..
దొంగిలించిన వెండిని అమరావతి సోదరుడు భరత్ సింహా ద్వారా విక్రయించారు. ఇలా పోలీసులే దొంగలుగా మారీ నగదును పంచుకున్నారు.ఇక తమను ఎవరూ పట్టుకోలేరని భావిస్తున్న సమయంలో ఈ దొంగతనం బయటపడి ఇద్దరు పోలీసులు కటకటాలపాలయ్యారు.
రెండేళ్ల క్రితం పోలీసులు స్వాధీనం చేసుకున్న వెండి, నగదు కోసం తమిళనాడు వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్స్ అమరావతి, రమణబాబు దొంగతనం గురించి బయటపడింది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం కౌతాళం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కొడుమూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమణబాబును అరెస్ట్ చేసారు. అలాగే చోరీ సొత్తును అమ్మిపెట్టిన అమరావతి భర్త విజయ్ భాస్కర్, సోదరుడు భరత్ సింహను కూడా అరెస్ట్ చేసారు.
కర్నూల్ పోలీస్ స్టేషన్ నుండి చోరీకి గురయిన 81 కిలోల వెండి, 10 లక్షల రూపాయల నగదును కానిస్టేబుల్స్ నుండి రికవరీ చేసారు. విధుల్లో వుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించి దొంగతనానికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణబాబుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూల్ ఎస్పీ సిద్దార్థ్ వెల్లడించారు.
