ఆదివారం రాత్రి ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. కణితూరు,  గోవిందపురం గ్రామాల మధ్య ట్రాక్టర్ పొలాల్లోకి దూసుకెళ్లింది. 

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద నలిగి ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. 

వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా లఖిదాసుపురం గ్రామానికి చెందిన బొంగి వంశీకృష్ణ ట్రాక్టర్ డ్రైవర్. ఆదివారం గున్న అజయ్ కుమార్ తో కలిసి ఇటుకల లోడ్ తీసుకుని పూండి వెళ్లాడు వంశీకృష్ణ. ఇటుకల లోడ్ ను దించేసి రాత్రి స్వగ్రామానికి ఇద్దరూ తిరుగుపయనం అయ్యారు. ఈ క్రమంలోనే నందిగామ మండలం కణితూరు, గోవిందపురం గ్రామాల మధ్యలో ట్రాక్టర్ ప్రమాదానికి గురయ్యింది. 

వేగంగా వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ వంశీకృష్ణతో పాటు అజయ్ కూడా ట్రాక్టర్ కింద చిక్కుకుపోయారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా రెప్పపాటులో ప్రమాదం జరగడంతో ఇద్దరూ మృతిచెందారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఇద్దరు మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. 

ఇదిలావుంటే గతవారం ఇలాగే రాజస్థాన్ లో ట్రాక్టర్ ప్రమాదం జరిగి పదిమంది మృత్యువాతపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని అతివేగంతో వచ్చిన జీపు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

రాజస్థాన్ లోని ఝుంఝును- గూడా గాడ్జీ హైవే పై ఈ ప్రమాదం జరిగింది. దైవదర్శనం చేసుకుని తిరిగి స్వస్థలానికి ట్రాక్టర్ పై బయలుదేరిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.