అన్నమయ్య జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. 

రాయచోటి : ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామునే దైవదర్శనానికి బయలుదేరిన 20మందితో కూడిన వాహనం వేగంగా వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. దీంతో ఇద్దరు మృతిచెందగా మరో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. మిగతవారు గాయాలతో బయటపడ్డారు. 

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కటికంవారిపల్లె గ్రామానికి చెందిన కొందరు మదనపల్లె సమీపంలోని బోయకొండ గంగమ్మ తల్లి ఆలయానికి బయలుదేరారు. టాటా ఏస్, టాటా సుమో వాహనాల్లో 20మంది తెల్లవారుజామున బయలుదేరారు. ఈ క్రమంలో టాటా ఏస్ వాహనం జాతీయ రహదారిపై వేగంగా వెళుతూ చిన్నిఒరంపాడు సమీపంలో అదుపుతప్పింది. దీంతో ముందు వెళుతున్న ట్రాక్టర్ ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో వాహనంలోని నర్సింలు(57) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరమ్మ(60) అనే మహిళను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం. 

Read More దారుణం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య.. విజయనగరంలో ఘటన

ప్రమాదం జరిగిన వెంటనే మరో వాహనంలోని వారు గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగినా సమయానికి వాహనం అందుబాటులో వుండటంతో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించి అందేలా చూసారు. లేదంటే క్షతగాత్రుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా వుండేది. 

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతులు, క్షతగాత్రుల వివరాలను తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.