కడప జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్‌తో ఇద్దరు చిన్నారుల మృతి
కడప జిల్లాలోని చెన్నూరు మండలం ఇవాళ విషాదం నెలకొంది. విద్యుత్ మెయిన్ లైన్ ను పట్టుకోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
కడప: జిల్లాలోని చెన్నూరు మండలం ఖాదర్‌ఖాన్‌కొట్టాలలో గురువారం నాడు విషాదం చోటు చేసుకుంది. రేకుల షెడ్డుపై ఎక్కి పొరపాటున విద్యుత్ మెయిన్ లైన్ పట్టుకున్న ఇద్దరు చిన్నారులు. విద్యుత్ షాక్ తో మృతి చెందారు. మృతులను 12 ఏళ్ల శశాంక్, 4 ఏళ్ల మనోజ్ గా గుర్తించారు. రేకుల షెడ్ పై ఎక్కిన వీరిద్దరూ పొరపాటున విద్యుత్ మెయిన్ లైన్లను పట్టుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటనలు గతంలో కూడా అనేకం నమోదయ్యాయి. గుంటూరు జిల్లా కారంపూడి ఇందిరానగర్ లో 2022 నవంబర్ 24వ తేదీన విద్యుత్ షాక్ తో తల్లీ, కొడుకు మృతి చెందారు. బట్టలు ఆరవేస్తున్న సమయంలో తల్లికి విద్యుత్ షాక్ కు గురైంది. ఆమె కేకలు వేయడంతో తల్లిని కాపాడేందుకు వెళ్లిన కొడుకు కూడా ఈ ఘటనలో మృతి చెందాడు.
2022 సెప్టెంబర్ 27న మెట్ పల్లిలో విద్యుత్ షాక్ తో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. స్నేహితుడి దుకాణం వద్ద బోర్డు రిపేర్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురై మరణించారు. 2022 ఆగష్టు 31న మంచిర్యాల మండలం బొప్పారంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు చనిపోయారు. పొలం వద్ద పనులు చేస్తున్న సమయంలో భార్య, కొడుకులు విద్యుత్ షాక్ కి గురయ్యారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
also read:అనంతపురంలో విషాదం:విద్యుత్ షాక్ తో నలుగురు కూలీలు మృతి
2022 జూలై 12న కామారెడ్డి లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. బట్టలు ఆరేస్తున్న భార్య విద్యుత్ షాక్ కు గురైంది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త కూడా మృత్యువాత పడ్డారు. తల్లీదండ్రులు మరణించిన విషయం తెలియని చిన్నారులు వారిని పట్టుకుని వారు కూడా మరణించారు.