కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం  మండలం తంబీగానిపల్లిలో గ్యాస్ సిలిండర్  పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబీగానిపల్లిలో ఓ వెల్డింగ్ షాపులో ఓ వాహనానికి ఆదివారం నాడు వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.  ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

గ్యాస్ సిలిండర్ పేలగానే స్థానికులు భయంతో పరుగులు తీశారు. లాక్ డౌన్ కారణంగా చాలా రోజులుగా వెల్డింగ్ దుకాణం తీయలేదు. లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ఓ వాహనానికి వెల్డింగ్ పనులను ఇవాళ నిర్వహించారు.

ఈ పనులు నిర్వహించే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంత కాలం దుకాణం తెరవని కారణంగా గ్యాస్ లీకై ఉంటుందనే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.లాక్ డౌన్ తర్వాత దుకాణాలు తెరిచిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.