రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కన్నతల్లిదండ్రులకు ఇద్దరు కొడుకుల్ని దూరం చేసింది. పదిహేను నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటామనగా జరిగిన ఈ ఘటనలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు కొడుకులు మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం తుని పట్టణం ఎస్‌.అన్నవరం రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన బర్రే వేణుయ్య, లోవలక్ష్మిలకు ముగ్గురు పిల్లలు. ఆదివారం ఉదయం వేణయ్య తన ఇద్దరు కుమారులను తీసుకుని తుని మండలం ఎస్‌.అన్నవరం పంచాయతీలోని కవలపాడుకు మోటార్‌ సైకిల్‌పై వస్తున్నాడు. తుని మార్కెట్‌లో చేపలు కొనుగోలు చేశారు. 

మోటార్‌ సైకిల్‌ వెనుక బియ్యం బస్తాను కట్టుకుని వస్తున్న సమయంలో తుని వైపు వస్తున్న కంటైనర్‌ ఢీకొంది. వెనుక కూర్చున్న ఇద్దరు కుమారులు దుర్గ (17), తాతాజీ (7) కంటైనర్‌ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వేణుయ్య మాత్రం ఎడమ వైపు పడడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. 

ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లి లోవలక్ష్మి, సోదరి సంతోషి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై ఇద్దరి మృతదేహాలను చూసి వారి దుఃఖానికి అవధులు లేకుండా పోయింది. అక్కడ వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. 

ఇటుక బట్టీలో కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఆ దంపతులు. ముగ్గురు పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. పిల్లలు  విశాఖ జిల్లా కోటవురట్ల గొల్లపేటలో ఉంటూ చదువుకుంటున్నారు. 

సొంతూరులో పని లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కవలపాడు గ్రామంలో ఇటుకల బట్టీలో బర్రే వేణుయ్య, అతని భార్య లోవలక్ష్మి పని చేస్తున్నారు. ఇటుకల బట్టీకి శనివారం సెలవు కావడంతో వేణుయ్య కోటవురట్ల  వెళ్లారు. అప్పటికి రెండు రోజుల ముందే కుమార్తె సంతోషి కవలపాడులో తల్లి దగ్గరకు వచ్చింది. కోటవురట్లలో ఉన్న కుమారులు దుర్గ, తాతాజీలను తీసుకుని ఆదివారం బైక్‌పై వేణుయ్య పయనమయ్యారు.

 కేవలం 15 నిమిషాల్లో వీరు కవలపాడుకు చేరుకుంటారనగా, అంతలోనే కంటైనర్‌ రూపంలో ఇద్దరు కుమారులను మృత్యువు కబళించింది. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. విగతజీవులుగా మారిన కుమారులను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. 

తుని పట్టణ సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌ శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.