అమరావతి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. సీఐలు, ఎస్సై, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు సృష్టించడమే కాకుండా నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు కూడా తయారు చేసినట్లు తేలింది. 

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో నకిలీ డాక్యుమెంట్లను తాయరు చేసి రవాణా శాఖ అధికారులకు సమర్పించిన విషయం వెలుగులోకి వచ్చింది. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై విచారణ జరుపుతున్న రవాణా శాఖ టాస్క్ ఫోర్స్ బృందం ఇప్పటి వరకు 56 నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.

బీఎస్ - 3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి ఫోర్జరీ డ్యాక్యుమెంట్స్ తో బీఎస్ -4గా రిజిస్ట్రేషన్ చేయించారు. నాగాలాండ్, కర్ణాటక రాష్ట్రాల్లో 154 లారీలను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు 20 లారీలను సీజ్ చేశారు. 

మిగిలిన వాహనాలను జేసీ ట్రావెల్స్ రహస్య ప్రదేశంలోకి తరలించినట్లు చెబుతున్నారు. రెండు లారీలను బస్సులుగా మార్చేసి వినియోగించినట్లు కూడా అధికారులు గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల వ్యవహారంపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.