అప్పుల బాధ తాళలేక ఓ టీవీ నటి ఆత్మహత్యచేసుకుంది. ఈ సంఘటన అమరావతిలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టాభిపురానికి చెందిన మద్దెల సబీరా అలియాస్ రేఖ(42) గతంలో రెండు టీవీ సీరియల్స్ లో నటించారు. ఆ తర్వాత ఆమె ఊహించిన విధంగా అవకాశాలురాలేదు. 

దీంతో.. గుంటూరు వచ్చి అహమ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొంతకాలం వారి సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. కాగా.. భర్తతో విడిపోయిన తర్వాత రేఖ చైతన్య అనే మరో వ్యక్తిని పెళ్లాడారు. 

స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలు, వేడుకల్లో పాటలు పాడుతూ, యాంకరింగ్ చేస్తూ జీవనం సాగించారు. ప్రస్తుతం విద్యానగర్ లోని నాలుగో లేనులో ఉంటున్నారు. కాగా.. గత రెండు సంవత్సరాలుగా ఆమెకు పాటలు పాడే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. భర్త చైతన్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అప్పులపాలయ్యాడు.

దీంతో.. వారికి అప్పుల బాధ ఎక్కువైంది. ఈ బాధను ఆమె తట్టుకోలేకపోయారు. బుధవారం స్నానానికి అని చెప్పి వెళ్లి తిరిగి బయటకు రాలేదు. భర్త చైతన్య అనుమానంతో తలుపులు పగలకొట్టి చూడగా.. ఆమె శవమై కనిపించింది. ఆమె బాత్రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు భర్త చైతన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.