తిరుపతి: లాక్ డౌన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం కోసం టీటీడీ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. లాక్‌డౌన్ ఎత్తివేస్తే భక్తులను ఎలా అనుమతి ఇవ్వాలనే విషయమై టీటీడీ ఇప్పటికే ప్రణాళికలను సిద్దం చేసింది.

కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాతే భక్తులను బాలాజీ దర్శనం కోసం అనుమతి ఇవ్వనుంది టీటీడీ. ఈ విషయమై ఈ నెల 28వ తేదీన జరిగే పాలకమండలి సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.లాక్ డౌన్ ఎత్తివేస్తే భక్తులకు శ్రీవారి దర్శనం విషయమై ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. 

ప్రతి రోజూ సుమారు 7 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా గుంపులు గుంపులుగా భక్తులకు ఆలయంలో దర్శనం కల్పించరు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటారు. గంటకు 500 మందికి మాత్రమే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. 

తొలుత టీటీడీ ఉద్యోగులకు దర్శనం కల్పించనున్నారు. మూడు రోజుల పాటు టీటీడీ ఉద్యోగులకు మాత్రమే ఈ దర్శనాన్ని పరిమితం చేయనున్నారు. ఆ తర్వాత సుమారు 15 రోజుల పాటు తిరుపతి, తిరుమలలో నివాసం ఉంటున్న స్థానికులకు స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నారు. 

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: రూ. 400 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ

ప్రతి రోజూ 14 గంటల పాటు మాత్రమే వెంకన్న దర్శనం భక్తులకు కలిగేలా చర్యలు తీసుకొంటుంది టీటీడీ. ఆన్ లైన్ లో దర్శనం కోసం టిక్కెట్లు బుక్ చేసుకొనేలా కూడ సర్వం సిద్దం చేసింది టీటీడీ.

also read:లాక్‌డౌన్ దెబ్బ: రోజూ రూ. 1.5 కోట్ల ఆదాయం కోల్పోయిన షిరిడి టెంపుల్

అలిపిరితో పాటు నడక మార్గంలో వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. తిరుమలలో వసతి గదుల్లో ఇద్దరిని మాత్రమే ఉంచేలా చర్యలు తీసుకొంటున్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే భక్తులకు ప్రవేశం కల్పించేందుకు వీలుగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకొంది.