తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నేటి నుంచి తిరుమలలో భక్తులకు ఫేస్ రికగ్నేషన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నేటి నుంచి తిరుమలలో భక్తులకు ఫేస్ రికగ్నేషన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. భక్తులకు సేవలను సజావుగా అందించడంలో మరింత పారదర్శకత కోసం టీటీడీ ఈ విధానాన్ని బుధవారం నుంచి ప్రయోగాత్మక ప్రతిపాదికన చేపట్టింది. తొలుత.. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని సర్వ దర్శనం (ఉచిత దర్శనం) కౌంటర్లు, తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, వసతి కేంద్రాలలో ప్రవేశపెట్టారు. ఈ నూతన విధానంతో దళారుల వ్యవస్థ తగ్గే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. 

మరోవైపు ఫేస్ రికగ్నేషన్‌ సాంకేతికను అమల్లోకి తీసుకురావడం వల్ల ఒక్కో భక్తుడు నెలకు ఒకేసారి మాత్రమే తిరుమలలో రూమ్ పొందేలా టీటీడీ చర్యలు చేపట్టనుంది. భక్తులను నెలకు ఒకసారి ఉచిత దర్శనం చేసుకోవడానికి అనుమతించబడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరుమల ఆలయంలో ఉచిత దర్శనం చేయడానికి ప్రయత్నిస్తున్న ఎవరైనా ఇప్పుడు ఒక నెల వ్యవధిలో ఒక్కసారికే పరిమితం చేయబడతారని తెలిపారు. భక్తుల కోసం సబ్సిడీ అద్దె గదుల కేటాయింపు విషయానికి వస్తే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ పారదర్శకతను పెంచేందుకు ఉపయోగపడుతుందని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. టీటీడీ గదులు పొంది.. వాటిని అధిక రేటుకు విక్రయించే మధ్యవర్తులను గుర్తించడంలో కూడా ఈ విధానం టీటీడీకి సహకరించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని 59,392 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 20,714 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4. 14 కోట్లు వచ్చింది.