ఆ ఆరోపణల్లో నిజం లేదు.. చర్చకు సిద్ధమా : టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డికి టీటీడీ ఈవో సవాల్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డిపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి స్పందించారు. ఆనం వెంకట రమణారెడ్డి చేసిన ఆరోపణలపై బహిరంగంగా చర్చకు సిద్ధమని ధర్మారెడ్డి సవాల్ విసిరారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డిపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి స్పందించారు. గురువారం ఆయన అన్నమయ్య భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తనపై 14 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదైందని, టీటీడీ ఈవోగా తనకు అర్హత లేదంటూ ఆనం చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈవోగా తనకు అన్ని అర్హతలు వున్నాయని.. కొందరు హైకోర్టుకు వెళితే, తన పదవి కలెక్టర్ హోదా కంటే ఎక్కువని న్యాయస్థానం చెప్పిందని ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆనం వెంకట రమణారెడ్డి చేసిన ఆరోపణలపై బహిరంగంగా చర్చకు సిద్ధమని ధర్మారెడ్డి సవాల్ విసిరారు.
అంతకుముందు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనం వెంకట రమణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతికి అడ్డాగా మారిందన్నారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక.. ఆలయానికి చెందిన డబ్బును తన కుమారుడు అభినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆనం ఆరోపించారు. తిరుపతిలో ఏ పనికైనా పది శాతం లంచం తీసుకుంటున్న భూమనను ఇప్పటికే 10 శాతం కరుణాకర్ రెడ్డిగా పిలుస్తున్నారంటూ సెటైర్లు వేశారు. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినయ్ రెడ్డి 5.45 ఎకరాలు ఎలా కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు.
తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల ఎలాగో.. టీటీడీలో ధర్మారెడ్డి వ్యవహారం అలాగే వుందని వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ధర్మారెడ్డిపై 14 సెక్షన్ల కింద ఢిల్లీలో గతంలో క్రిమినల్ కేసు నమోదైందని, దానిని దాచిపెట్టి ఆయన టీటీడీ ఈవో అయ్యారని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని క్రిమినల్ కేసులు వున్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి ఎలా ఇస్తారని వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. క్రిమినల్ కేసులపై తీర్పు వచ్చే వరకు ధర్మారెడ్డిని టీటీడీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆనం డిమాండ్ చేశారు.