అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను సుసంపన్నం చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సూచించారు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. మంగళవారం విజయవాడలోని గేట్ వే హోటల్ లో బస చేసిన ఆయనను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. 

శ్రీవారి చిత్రపటాన్ని గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. అలాగే శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా నిత్యం భక్తిప్రపత్తులతో పూజలు చేస్తుంటాట గదా అని వైవీని ప్రశ్నించారు గవర్నర్ నరసింహన్. 

మీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం దేదీప్యమానంగా వెలుగొందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు సాధ్యమైనంత తక్కువ సమయంలో దర్శనమయ్యేటట్లు చూడాలని కోరారు. 

ఈ సందర్భంగా టీటీడీలో సమూల మార్పులు చేపట్టబోతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి గవర్నర్ నరసింహన్ కు తెలియజేశారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. కొండపై రద్దీ తగ్గించేందుకు భక్తులకు కొండ కిందనే వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.