తిరుమలలో భక్తుల దర్శనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో టీటీడీ కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ నెల 8 నుంచి ట్రయల్ రన్ పద్ధతిలో శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ప్రస్తుతం 7-8 వేల మంది భక్తులతో దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దర్శనాలు మూడు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తామని.. 10 లేదా 11వ తేదీ నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఇస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.

సర్వదర్శనానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరని.. అలిపిరి వద్ద, మెట్ల మార్గంలో ఆన్‌‌లైన్‌ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు. క్యూలైన్‌లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని.. శ్రీవారి పుష్కరిణీలో స్నానాలకు అనుమతి లేదని ఆయన చెప్పారు.

Also Read:శ్రీవారి భక్తులకు శుభవార్త: వెంకన్న దర్శనానికి ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్, తొలుత వారికే

పూర్తి స్థాయిలో దర్శనాలు ప్రారంభమైతే, బయట ప్రాంతాల్లో లడ్డూల విక్రయాలు నిలిపివేస్తామని వైవీ స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు సుబ్బారెడ్డి. 

కాగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా భక్తులకు దూరంగా వున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు సర్కార్ అనుమతించింది.

భక్తుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు టీటీడీ కార్యనిర్వహణాధికారికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ లేఖ రాశారు.