హైదరాబాద్: ప్రభుత్వం నుండి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టుగా టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. దేవుడి ముందు ప్రమాణం చేసినందున..... సెంటిమెంట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామా చేయడం కంటే  ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం ఆధారంగా ఈ పదవి నుండి తప్పుకొంటానని  ఆయన ప్రకటించారు.

బుధవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్‌తో ఇంటర్వ్యూ ఇచ్చారు. వెంకటేశ్వరస్వామికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ పదవిని స్వీకరించినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ పదవిలో కొనసాగడం సెంటిమెంట్ అన్నారు. గత నెల 28వ తేదీన బోర్డు మీటింగ్‌ను అధికారులు బహిష్కరించడం సరైందికాదన్నారు.

అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని పుట్టా సుధాకర్ యాదవ్ విమర్శించారు. టీడీపీ అధికారం కోల్పోవడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో అధికారులు ఓవర్ యాక్షన్ చేయడం సరైందికాదన్నారు.  ఇటీవల జరిగిన బోర్డు సమావేశం తర్వాత ఏం చేయాలనే దానిపై బోర్డు సభ్యులంతా చర్చించుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా నడుచుకొందామని నిర్ణయం తీసుకొన్నామన్నారు. ఆర్డినెన్స్ ద్వారా పాలకమండలిని రద్దు చేస్తే  కోర్టును ఆశ్రయించబోమని ఆయన స్పష్టం చేశారు.