చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తప్పుడు వార్తాథనాలు ప్రచురించిందని ఆరోపిస్తూ ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించింది. 

ఆలయ ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితుల నియామకానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. 2019-20 వార్షిక బడ్జెట్ కింద రూ.3243 కోట్లకు పాలక మండలి ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. 

ఘాట్ రోడ్డు మరమ్మతు కోసం రూ.10 కోట్లు, టీటీడీ పరిపాలనా భవన మరమ్మతులకు రూ. 14.30 కోట్లు కేటాయించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్డు భద్రతా ప్రమాణాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

రూ. 14 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూ కాశ్మీర్, వారణాసిల్లోనూ ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. 

సోషల్ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టడానికి సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు వైవీ సుబ్బా రెడ్డి తెలిపారు. దానికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తామని చెప్పారు. 2019 - 20 శ్రీవారి హుండీ ఆదాయం రూ.1285 కోట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.330 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.