అమరావతి: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. 
టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను ఒక ఛానెల్ తన వెబ్‌సైట్లో పొందుపరచిందని చెప్పుకొచ్చారు.  

సంబంధిత వెబ్‌సైట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే కేసు కూడా పెట్టనున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటైన యాభై రోజుల్లో టీడీపీ రోజు రోజుకు దిగజారిపోతుందని విమర్శించారు. సీఎం వైయస్ జగన్ చేస్్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.  

టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించలేకపోతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. 
దేవుడు ముందు అందరూ సమానులే అని తాము నిరూపిస్తుంటే, ఆ చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, వైయస్‌.జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
తమ చేతిలో ఉన్న ఎల్లోమీడియాను వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలా విషప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.