ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రెజరీ బిల్లుల కుంభకోణం సంచలనం రేపుతోంది . బోగస్ టీడీఎస్ క్లెయిమ్‌లతో రూ.3 కోట్ల వరకు ట్రెజరీ అధికారులు, సిబ్బంది కలిసి కాజేశారని ఐటీ శాఖ తేల్చింది. 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రెజరీ బిల్లుల కుంభకోణం సంచలనం రేపుతోంది. జిల్లాలోని పలు ఉప ఖజనా కార్యాలయాల్లో అధికారులు బోగస్ టీడీఎస్ బిల్లులు క్లెయిమ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు సబ్ ట్రెజరీ అధికారులు , ఒక అకౌంటెంట్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులపై తిరుపతి ఆదాయపు పన్ను శాఖ అధికారి రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లి పోలీసులు ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులపై కేసులు నమోదు చేశారు. మదనపల్లి ఎస్టీవో శ్రీనివాస్, తంబళ్లపల్లి ఎస్టీవో బాలమురళి, పీలేరు ఎస్టీవో కార్యాలయంలోని సీనియర్ అకౌంటెంట్ ఇంతియాజ్ అలీపై కేసులు నమోదయ్యాయి. వీరంతా బోగస్ క్లెయిమ్‌లు సమర్పించి రూ.3 కోట్లు గండికొట్టారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, వాయల్పాడు , పుంగనూరులోని ట్రెజరీ కార్యాలయాల్లో టీడీఎస్ బోగస్ క్లెయిమ్‌లను గుర్తించింది ఐటీ శాఖ. ముగ్గురు టీటీవోలకు సైతం ఛార్జ్ మెమోలను జారీ చేశారు ఖజానా శాఖ అధికారులు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును క్లెయిమ్‌ల రూపంలో సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు . రాష్ట్రంలోని పలు ట్రెజరీ కార్యాలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లుగా భావిస్తున్న ఐటీ శాఖ వాటిపై ఫోకస్ పెట్టింది. లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయంటున్నారు.