న్యాయం కోసం చాలా మంది పోలీస్ స్టేషన్ కి వెళతారు. అయితే... కొందరు పోలీసులు మాత్రం బాధితుల పట్ల సరిగా మాట్లాడటం లేదని ఫిర్యాదు  చాలాసార్లు వినపడే ఉంటుంది. అయితే... ఈ విషయాన్ని తేల్చడానికి ఓ ట్రైనీ ఐపీఎస్ రంగంలోకి దిగాడు. సామాన్యుడిలా స్టేషన్ లోకి అడుగుపెట్టి... పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ సంఘటన ఒంగోలులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ ట్రైనీ ఐపీఎస్ జగదీశ్ శుక్రవారం ఒంగోలులోని తాలుకా పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. వచ్చి... తన సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చాడు. డీటైల్స్ అడిగి అక్కడి పోలీసు వివరాలు రాసుకున్నాడు. అయితే... ఆ యువకుడు తనకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలని అడిగాడు. దానికి అక్కడి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్సై వరకు అతని పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడారు. రోజూ వందల ఫోన్లు పోతూ ఉంటాయని.. అన్నింటికీ కేసులు రాసి పట్టుకోవాలంటే.. స్టేషన్ మూసుకోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దాదాపు రెండు, మూడు గంటలపాటు.. సదరు యువకుడు అక్కడ వెయిట్ చేశాడు. కనీసం కూర్చోమని కూడా అతనిని పోలీసులు అడగకపోవడం గమనార్హం.

ఆ తర్వాత... అతను సాధారణ వ్యక్తి కాదని.. ఓ ట్రైనీ ఐపీఎస్ అని తెలిసి పోలీసులంతా కంగుతిన్నారు. కాగా.... స్టేషన్ లో విధులు సరిగా నిర్వర్తించకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైటర్ ని సస్పెండ్ చేశారు. 

ట్రైనీ ఐపీఎస్ జగదీశ్.. స్టేషన్ లో పోలీసులు వ్యవహరించిన తీరు..తనపై పరుష పదజాలంతో మాట్లాడిన మాటలు మొత్తం వివరిస్తూ... ఎస్పీకి లేఖ రాశారు. ఆయన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. విధులు సక్రమంగా వ్యవహరించని రైటర్ ని సస్పెండ్ చేశారు. ఇతర పోలీసులపై కూడా క్రమశిక్షణా రాహిత్యం కింద చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పారు.