ఈత కొట్టాలనే సరదా యువకుడి ప్రాణాలను తీసింది. ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతల్లో లోతు ఎంత ఉందో అవగాహన లేకుండా దిగి, ఈత కొడుతుండగానే ఓ యువకుడు మునిగిపోయాడు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.

ఇసుక కోసం తీసిన గుంతలో మునిగిపోయి ఓ మెడికల్ కాలేజీ స్టూడెంట్ మరణించాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలంలో ఉన్న వెంకట పద్మావతి మెడికల్ కాలేజీలో 19 ఏళ్ల కార్తీక్ అనే యువకుడు ఫిజియోథెరపీ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ యువకుడి స్వస్థలం కర్నూలు జిల్లా డోన్ మండలం.

కాగా.. ఆదివారం సెలవు దినం కావడంతో కార్తీక్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి తన కాలేజీకి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది దగ్గర ఇసుక రేవుల్లో ఈత కోసం వెళ్లారు. ఈత మొదలు పెట్టిన కొంత సమయం తరువాత కార్తీక్ ఓ గుంత లోపలికి కూరుకుపోయాడు. ఆ గుంత సుమారుగా 25 నుంచి 30 అడుగులు ఉంటుంది. అయితే అతడిని కాపాడేందుకు వెంట వచ్చిన హబూబ్‌బాషా, సంతోష్‌ లు ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాకపోవడంతో గట్టిగా కేకలు వేశారు. 

ఈ కేకలు వినిపించడంతో స్థానికంగా ఉన్న యువకులు వేగంగా వచ్చారు. ఇసుక రీచ్ గుంతల్లోకి దిగి గాలింపు చేపట్టారు. కొంత సమయం తరువాత కార్తీక్ డెడ్ బాడీ లభించింది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అలాగే పలువురు టీడీపీ నాయకులు కూడా అక్కడి చేరుకున్నారు. నిబంధనల్లో పేర్కొన్న దానికి మించి ఇక్కడ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, విద్యార్థి మరణానికి ప్రభుత్వమే కారణమని వారు ఆరోపించారు. 

వెంటనే ఇసుక తవ్వకాలు ఆపేయాలని, లేకపోతే ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. దీంతో తహసీల్దార్ అక్కడ ఇసుక రీచ్ లను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నారు.