రైలు వేగంగా దూసుకొస్తున్న సమయంలో ట్రాక్ పై ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ప్రమాదకర సంఘటన గుణదలలో చోటుచేసుకుంది.
విజయవాడ :రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవడం అందరూ చూసే వుంటారు... కానీ రైల్వే ట్రాక్ పై ట్రాఫిక్ జామ్ ఎప్పుడూ చూసుండరు. తాజాగా ఓ వైపు రైలు దూసుకొస్తుండగా రైల్వే ట్రాక్ పై వాహనాలు నిలిచిపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే స్టేషన్ మాస్టర్ చాకచక్యంగా వ్యవహరించిన రైలును నిలపడంతో పెను ప్రమాదం తప్పింది.
గుణదలలో రోడ్డుపైకి వచ్చే వాహనాల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ జామ్ లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చివరకు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే ఏకంగా రైల్వే ట్రాక్ పైనే ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలా తాజాగా రైలు వచ్చే సమయంలో ట్రాక్ పై వాహనాలు నిలిచిపోయిన ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ట్రైన్ దూసుకొస్తుండగా ట్రాక్ పై నిలిచిపోయిన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వీడియో
అయితే పరిస్థితిని గుర్తించిన స్టేషన్ మాస్టర్ చొరవతో పెను ప్రమాదం తప్పింది. రైలును స్టేషన్లోనే ఆపించి ట్రాక్ పై వున్న వాహనాలను పక్కకు తీయించారు. అనంతరం ఇరువైపులా గొలుసులను ఏర్పాటుచేసి ట్రైన్ వెళ్లేవరకు జాగ్రత్త తీసుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది.
ఈ క్రమంలో గుణదల ప్రజలు తక్షణమే రైల్వే ట్రాక్ పై ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజూ ట్రాక్ పై ఇలాగే ట్రాఫిక్ నిలిచిపోతూ ప్రమాదకరంగా మారుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
