కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది: రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఇక నుండి ఫాం హౌస్ నుండి బయటకు రావాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
న్యూఢిల్లీ: కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారంనాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలో లేరన్నారు.ఫాంహౌస్ నుండి కేసీఆర్ బయటకు రావాల్సిన పనిలేదన్నారు. డిసెంబర్ లో రాష్ట్రంలో అద్భుతం ఆవిష్కరించబోతోందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరలేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.కేసీఆర్ కుటుంబం ప్రజా ధనాన్ని దోచుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఈ దఫా ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. తెలంగాణ ప్రకటించిన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఈ దఫానైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది. దీంతో కర్ణాటక రాష్ట్రంలో అనుసరించిన ఫార్మూలాను తెలంగాణలో కూడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది.
ఈ నెల 15 నుండి బస్సు యాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ యాత్రలో పార్టీ అగ్రనేతలు కూడ పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ నెల 15, 16 తేదీల్లో కాంగ్రెస్ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ యాత్ర ప్రారంభానికి ముందే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. బస్సు యాత్రకు ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల 15న అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.
also read:టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలి: కాంగ్రెస్‌ను కోరుతున్న మహిళా, యూత్ విభాగాలు
ఎన్నికల మేనిఫెస్టోపై మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేస్తుంది. మేనిఫెస్టో కమిటీ జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజల నుండి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచలను తీసుకుంటుంది.