హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఆసక్తికర వ్యాక్యలు చేశారు. ఫేస్ బుక్ వేదికగా కేసీఆర్ తో జగన్ మైత్రిపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ చెప్తున్నారు. 

ఈ సందర్భంగా జగన్ ను తాను ఒకటి అడుగుతున్నా అంటూ మెుదటి ప్రశ్న సంధించారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించారనే కారణంతో రెండేళ్లపాటు అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలంతా బహిష్కరించారని గుర్తు చేశారు. 

ఏపీలో ఫిరాయింపులపై తిరుగుబాటు చేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభాలు పెడుతున్న కేసీఆర్ గారితో కలిసి, జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చెయ్యాలని జగన్ గారు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. 

ఏపీలో తప్పైతే తెలంగాణలో ఎలా ఒప్పవుతుందో జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం జగన్ దృష్టిలో తప్పా ఒప్పా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇకపోతే సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ సందర్భంలో ఫెడరల్ ఫ్రంట్ కు సానుకూలంగా జగన్ కామెంట్ చేశారు. 

అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న పార్టీతోనే కలుస్తామని చెప్పుకొచ్చారు. అయితే విజయశాంతి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది వేచి చూడాలి.