చిన్న సినిమాలు బ్రతకాలంటే చేయాల్సిందిదే..: హీరో సుమన్ (వీడియో)
చిన్న సినిమాలకు అవకాశం ఇస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ పదికాలాలు పచ్చగా వుంటుందని హీరో సుమన్ తెలిపారు.

గుంటూరు : టాలీవుడ్ స్టార్ సుమన్ ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో సందడి చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సుమన్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. అనంతరం నిర్వహకులు ఆయనకు సన్మానం చేసారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ... తెలుగు సినిమా పరిశ్రమ మరింత అభివృద్ది జరగాల్సిన అవసరం వుందన్నారు. చిన్న సినిమాలకు అవకాశం ఇస్తే ఇండస్ట్రీ పదికాలాలు పచ్చగా వుంటుందని తెలిపారు. చిన్న సినిమాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... వాటి ప్రదర్శన కోసం చిన్న థియేటర్లు గవర్నమెంట్ అద్వర్యంలో పనిచేయాలని సూచించారు.
వీడియో
సినిమా పరిశ్రమలో అత్యధికంగా నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే... వారిని ఆదుకునే నాధుడే వుండరని సుమన్ పేర్కొన్నారు. డిస్టిబ్యూటర్ ఉంటేనే చిన్న సినిమాకు మనుగడ వుంటుందన్నారు. సినిమా వారే కాదు ఏరంగంలోని వారైనా మేలు చేసినవారిని మరిచిపోవద్దని సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో మరింత ఎక్కువగా షూటింగ్ జరగాల్సిన అవసరం వుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమాలకు టాక్స్ బెనిఫిట్స్, షూటింగ్ బెనిఫిట్స్ కల్పించాలని సుమన్ కోరారు.