ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసిపి శ్రేణులు వినూత్న నిరసన
తిరుపతి : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే అధికార వైసిపికి షాకిచ్చిన విషయం తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కాస్త డీలాపడ్డ వైసిపి శ్రేణులను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం మరింత నిరుత్సాహపర్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసిపికి షాకిచ్చి టిడిపి అభ్యర్థికి ఓటేసి గెలిపించారు.ఇలా టిడిపికి ఓటేసారంటూ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెండ్ చేసింది. అంతేకాదు వైసిపి శ్రేణులు సదరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
వైసిపి పార్టీని దెబ్బతీసేలా వ్యవహరించిన నలుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లాలో వినూత్న నిరసన చేపట్టారు. వెంకటగిరిలో ఎమ్మెల్యేల కటౌట్లను ఏర్పాటుచేసి వాటికి నల్ల జెండాలు కట్టి కైవల్యా నదిలో నిమజ్జనం చేపట్టారు. స్ధానిక వైసిపి నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలకు పుట్టగతులుండవని వైసిపి నాయకులు హెచ్చరించారు.
Read More అన్న కోసం ఫైట్ చేశా.. చివరికి వాళ్లు కూడా అధికారం కోసమే : మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు
ఇదిలావుంటే ఇప్పటికు పలుమార్లు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంప వైసిపి శ్రేణులు దాడికి దిగారు.వైసిపికి వ్యతిరేకంగా ఓటేసి టిడిపి గెలుపుకు కారణమయ్యారంటూ శ్రీదేవిపై ఆగ్రహంతో వున్న వైసిపి కార్యకర్తలు ఆమె కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ప్లెక్సీలను చించివేస్తూ శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల వైసిపి శ్రేణులకు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేసారు.
తాజాగా మరోసారి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయం వద్దగల ప్రచార రథం తనదేనంటూ ఓ మహిళ ఆందోళనకు దిగింది. పార్టీ అవసరాల కోసం తానే ప్రచార రథాన్ని కొన్నానని.. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యే దగ్గర తమ కారు వుండటానికి వీల్లేదంటూ గ్రేసి లిడియా అనే మహిళ మండిపడ్డారు. అయితే పోలీసులు ప్రచార రథాన్ని తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకుని... డాక్యుమెంట్స్ చూపించి తీసుకెళ్లాలని సదరు మహిళకు సూచించారు.
ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం కూడా ఉదయగిరిలో ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే, వైసిపి నేతలకు మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉదయగిరిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే మేకపాటి కుర్చీ వేసుకొని కూర్చుని చర్చకు సిద్దమంటూ సవాల్ ను స్వీకరించారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత వైసిపి నాయకులు అక్కడికి చేరుకుని మళ్లీ సవాల్ అంటూ ఆందోళన చేపట్టారు. ఇలా ఉదయగిరిలోనూ ఆందోళన కొనసాగుతోంది.
