తిరుపతి: అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈనెల(ఏప్రిల్) 14వ తేదీన వైసిపి తరపున సీఎం జగన్ ప్రచారంలో పాల్గొననున్నారు. తిరుమలలో తాజా పరిణామాల నేపథ్యంలో తాను స్వయంగా ప్రచారం చేపట్టడం అవసరమని భావిస్తూ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

తిరుపతి లోకసభ పరిధిలోని 6అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశించిన మేరకు లేదని పార్టీ వర్గాల నుండి జగన్కు సమాచారం అందినట్లు సమాచారం. అలాగే ఇంటెలిజెన్స్ నివేదిక లో కూడ ఇదే సమాచారాన్ని సీఎంకు తెలిపిందట. దీంతో తానే స్వయంగా ప్రచారానికి వెళ్ళి పరిస్థితిని చక్కదిద్ది వైసిపి అభ్యర్థిని గెలిపించాలని నిర్ణయించారట. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పే ప్రయత్నం ఈ ప్రచారం ద్వారా జగన్ చేయనున్నారట. 

ఇదివరకే తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు.ఏప్రిల్ 17వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగననున్నాయి. ఈ ఎన్నికల్లో  పార్టీ అభ్యర్ధి భారీ మెజారిటీతో విజయం సాధించాలనే పట్టుదలతో పనిచేయాలని ఆయన నేతలకు సూచించారు.

స్థానిక సంస్థల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా అతి విశ్వాసానికి పోవద్దని సీఎం పార్టీ నేతలకు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ సమావేశంలలో తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేయనున్న డాక్టర్ గురుమూర్తిని సీఎం పార్టీ నేతలకు పరిచయం చేసి గెలిపించి ఆశీర్వదించాలని సూచించారు.