తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ షోలకు షాక్ తగిలింది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన సాధారణ షోలు ఆగిపోయాయి. సినిమా ప్రదర్శనలను ఆపేయాలని థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు అందాయి. దీంతో వకీల్ సాబ్ ప్రదర్శనలు ఆగిపోయాయి.

దాంతో పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. థియేటర్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో థియేటర్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. దీంతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తిరుపతి లోకసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తున్నాయి. 

ఇదిలావుంటే, కడప జిల్లా బద్వేలులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. థియేటర్ లోని కుర్చీలను విరగ్గొట్టారు. పవన్ కల్యాణ్ అబిమానులకు, ధియేటర్ యజమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారంనాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. పింక్ హిందీ సినిమా ఆధారంగా ఈ సినిమా తీశారు. పలు చోట్ల ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.