అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలను ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన మెరువ నరేంద్ర కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వకీల్ సాబ్ సినిమాపై ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

తిరుపతి లోకసభ ఉప ఎన్నిక జరుగుతున్నందున దానిపై సినిమా ప్రభావం పడుతుందని బుధవారంనాడు ఆయన ఫిర్యాదు చేశారు. గుర్వారంనాడు ఆ ఫిర్యాదును చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె. విజయానంద్ విచారించారు. సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆయన రిటర్నింగ్ అధికారి అయిన నెల్లూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు 

విజయానంద్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ నివేదిక పంపించారు. జనసేనకు, బిజెపికి మధ్య పొత్తు ఉందని, తిరుపతి లోకసభ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారని ఆయన తన నివేదికలో చెప్పారు. ప్రభుత్వ పరిధిలోని చానెల్ దూరదర్శన్ లో ప్రసారం కాకూడదని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్నదని, ీ సినిమాకు అది వర్తించదని ఆయన చెప్పినట్లు సమాచారం. వకీల్ సాబ్ సినిమా విడుదలకు ఫిర్యాదులో పేర్కొన్న అభ్యంతరాలను ఆయన తోసిపుచ్చారు. 

కాగా, కరోనా కారణంగా వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదు. దానిపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదు. కానీ ఎక్కడికక్కడ అధికారులు ఆ సినిమా బెనిఫిట్ షోలు ఆడించకూడదని ఆదేశాలు జారీ చేశారు. వకీల్ సాబ్ సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. హిట్ టాక్ కూడా తెచ్చుకుంది.