తిరుపతి:  తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పెద్ద యెత్తున ప్రయత్నాలు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఈసీకి లేఖ రాశారు. దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ నేతలు తిరుపతి పార్లమెంటు చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి బస్సుల్లో, లారీల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలను తీసుకుని వచ్చారని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ కు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఫోన్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్, కేంద్ర ఎన్నికల అధికారులతో  తిరుపతి పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైసీపీవారిని టీడీపీ శ్రేణులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారని తెలిపారు. దొంగ ఓట్లపై వెంటనే చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

ప్రక్కన ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, జిల్లాల నుండి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తిరుపతి పార్లమెంటు పరిధిలోకి చొరబడ్డారని చంద్రబాబు తన లేఖలో ఫిర్యాదు చేశారు.  తిరుపతి పార్లమెంటులోని సరిహద్దు ప్రాంతాలలోని చెక్ పోస్ట్ ల వద్ద సరైన నిఘా లేదని, మరింతగా నిఘా పెంచాలని కోరిన చంద్రబాబు నిఘా లేకపోవడంతో అనేక మంది బయటి వ్యక్తులు లోపలికి చొరబడుతున్నారని ఆయన ఆరోపించారు. 

ఈ రోజు జరిగే పొలింగ్ లో అక్రమాలకు పాల్పడేందుకు చీకటి మంతనాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. ఊర్లలో లేనివాళ్ళు, వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు, చనిపోయిన ఓటర్లను గుర్తించి ఉదయాన్నే రిగ్గింగ్ చేసుకోవడానికి అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఆయన అన్నారు..తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు బయట వ్యక్తులు భారీగా వచ్చి చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఇదివరకే తెలియజేసిందని ఆయన గుర్తు చేశారు.

పుంగనూరు నుండి బస్సులలో భారీ సంఖ్యలో తిరుపతి పార్లమెంటు లోకి వస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎన్నికల సంఘం తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో, ప్రత్యేకంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో అదనపు కేంద్ర బలగాలను మోహరించి బయటి వ్యక్తులను నియంత్రించాలని చంద్రబాబు కోరారు. 

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని సరిహద్దుల పర్యవేక్షణ పెరగాలని, ఫ్లయింగ్ నిఘా బృందాలు (ఎఫ్‌ఎస్‌టిఎస్) పెట్రోలింగ్ పెరగాలని ఆయన అన్నారు. పోలింగ్ బూత్ లు ఆక్రమించటం, రిగ్గింగ్, హింసను ప్రేరేపించే విధంగా పెద్దఎత్తున బయట వ్యక్తులు చొరబడ్డారని ఆయన అన్నారు. హోటళ్ళు, లాడ్జీలు,, ఫంక్షన్ హాల్స్, ప్రైవేట్ గెస్ట్ హౌస్ లను పర్యవేక్షించాలని కోరారు.

వాలంటీర్ల ద్వారా వైసీపీ నేతలు చేయిస్తున్న డబ్బు, మద్యం పంపిణీని నివారించాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించాలని చంద్రబాబు సూచించారు. నకిలీ ఓట్ల పోలవకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. సమన్వయ లోపాన్ని సరిచేసి స్వేచ్ఛాయుత ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.