Tirupati Bomb Threat : తిరుపతిలోని ఆలయాలను బాంబులతో పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. పోలీసుల ముమ్మర తనిఖీలతో అసలేం జరుగుతుందో అర్థంకాక ప్రజల్లో భయాందోళన నెలకొంది.
Tirupati Bomb Threat : ఆంధ్ర ప్రదేశ్ లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని హిందూ దేవాలయాల్లో బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తుల నుండి అధికారులకు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో కంగారుపడిపోయిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బెదిరింపు మెయిల్ లో పేర్కొన్న ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ తో పాటు జాగిలాలు, ఇతర బాంబు నిర్వీర్య విభాగాలు రంగంలోకి దిగాయి.. ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యగా ఆలయాల్లోని భక్తులను అనుమతించడంలేదు.
తిరుపతిలోని ఆ ప్రాంతాల్లోనే బాంబులు పెట్టారట…
తిరుపతిలో కపిలతీర్ధ ఆలయం, గోవిందరాజస్వామి ఆలయాలతో పాటు శ్రీనివాసం, విష్ణునివాసం, స్థానిక బస్టాండ్ లో బాంబులు పెట్టినట్లు దుండగులు బెదిరించారు. ఈ ప్రాంతాలన్ని నిత్యం రద్దీగా ఉంటాయి... నిజంగానే బాంబులు పెట్టివుంటే భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశాలుంటాయి. అందుకే అప్రమత్తమైన పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు... ఛాన్స్ తీసుకోకుండా వెంటనే తనిఖీలు చేపట్టారు. ఇప్పటికయితే ఎలాంటి బాంబులను గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు.
ఈ-మెయిల్ లో పేర్కొన్న ఆలయాలతో పాటు మరికొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా తిరుపతిలో జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణంలోనూ తనిఖీలు చేపట్టారు. దీంతో కోర్టు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
సీఎం పర్యటన వేళ బాంబుల కలకలం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 6న అంటే వచ్చే సోమవారం తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సీఎం హెలిక్యాప్టర్ ల్యాండింగ్ కోసం ఇప్పటికే అగ్రికల్చర్ కాలేజ్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు... అక్కడ కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఇక ముందుజాగ్రత్తగా తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లోని భద్రతా సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. అనుమానాస్పద వస్తువులు, మనుషులు కనిపిస్తే వెంటనే 100 కు డయల్ చేసి సమాచారం అందించాలని తిరుపతి పోలీసులు ప్రజలకు సూచించారు.
స్టాలిన్, త్రిష నివాసాలకు కూడా బాంబు బెదిరింపులు :
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు ప్రముఖ సినీనటి త్రిష ఇళ్లలో కూడా బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. దీంతో తమిళనాడు పోలీసులు అప్రమత్తం అయ్యారు. తమిళనాడు బిజెపి కార్యాలయం, డిజిపి ఆఫీసు, రాజ్ భవన్ కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా చెన్నైలోని ప్రముఖ ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు ప్రచారం జరగడంతో అలజడి రేగింది... దీంతో నగరంలో భద్రతను మరింత పెంచారు. ఈ బాంబు బెదిరింపులు ఎక్కడినుండి వచ్చాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది... ఇది ఆకతాయిల పనా లేక ఉగ్రవాదుల కుట్రనా అన్నది తేలాల్సి ఉంది.
