తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించాయి. ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ అక్రమాలకు పాల్పడిందంటూ వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడి భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ మాట్లాడుతూ.. పోలింగ్‌లో పోలీసుల అరాచకాలు జరిగాయని ఆమె ఆరోపించారు. 

బీజేపీ ఏజెంట్లను పోలీసులు నిర్బంధించారని.. ఇతర జిల్లాల నుంచి రౌడీలు, గుండాలు ఓటు వేయడానికి వచ్చారని రత్నప్రభ అన్నారు. వీరి వల్ల స్థానిక ఓటర్లకు అవకాశం రాలేదని ఆమె ఆరోపించారు. 

వైసీపీ నేతలు ఓటర్లకు డబ్బు, మద్యం ఇచ్చి తరలించారని.. జగన్ పాలనపై ఆయనకే నమ్మకం లేదని రత్నప్రభ ఎద్దేవా చేశారు. మరోనేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ, పోలీసుల ఆగడాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని వివరించారు.

Also Read:వాళ్లంతా భక్తులు.. దొంగ ఓట్లు వేసే ఖర్మ వైసీపీకి పట్టలేదు: చంద్రబాబుకు పెద్దిరెడ్డి చురకలు

అంతకుముందు చెదురుమదురు ఘటనలు మినహా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. అయితే ఓటరు పోలింగ్ కేంద్రానికి రావడానికి అంతగా మొగ్గు చూపలేదు. సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్‌ నమోదయింది.

సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్‌ పూర్తవగా.. 6 నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. 7 గంటల వరకు క్యూలో వున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.