తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్దమయ్యారు. దాదాపు 80 రోజుల తర్వాత ఇవాళ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సామాజిక దూరం పాటిస్తూ మొదట టీటీడీ ఉద్యోగులతో ట్రయిల్ రన్ ప్రారంభించింది టిటిడి. ఇందుకోసం నేడు, రేపు కేవలం టిటిడి ఉద్యోగులకు మాత్రమే స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించనున్నారు.  ఉదయం 6.30 నిమిషాలకు స్వామివారి దర్శనానికి ఉద్యోగులకు అనుమతించారు. ఇవాళ 5600దర్శనం టిక్కెట్లను టీటీడీ ఉద్యోగులకు జారీ చేసింది టిటిడి. 

బుదవారం నుండి స్థానికులకు ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నట్లు అధికారులు  తెలిపారు. అయితే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, పదేళ్ల లోపు చిన్నారులకు ఆలయ ప్రవేశం తాత్కాలికంగా నిలిపివేసినట్లు... వారు ఎట్టి పరిస్థితుల్లో తిరుమలకు రాకూడదని సూచించారు. మిగతా భక్తులు కూడా ముఖానికి మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించి ధర్శనానికి రావాలని... లేదంటే క్యూలైన్ లోకి అనుమతించబోమని తెలిపారు. 

రెండు గంటకు ఒకమారు క్యూలైన్ లో శుద్ధి చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. అలాగే క్యూలైన్, కళ్యాణ కట్టలో పనిచేసే ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, విజిలెన్స్ సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. 

read more   కొండపై అక్రమాలు, క్వారీయింగ్‌కు అడ్డుచెప్పని వైనం: సింహాచలం ఈవోపై వేటు

కేవలం టిక్కెట్లు పొందిన భక్తులను మాత్రమే అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు అనుమతివ్వనున్నట్లు తెలిపారు. అలిపిరి నడక మార్గం ద్వారా కాలిబాటకు అనుమతివ్వగా శ్రీవారి మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన టీటీడీ తెలిపింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రోజుకు 200మందికి ర్యాండం కరోనా టెస్టులు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి థర్మల్ స్కానింగ్ నిర్వహించనున్నారు. 

భౌతిక దూరాన్ని పాటించాలని సూచించే బోర్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కంటైన్మెంట్ జోన్ లలో నివసించే భక్తులకు తిరుమల కొండపైకి ప్రవేశించేందుకు అనుమతించబోమని టిటిడి వెల్లడించింది.