Asianet News TeluguAsianet News Telugu

తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనానికి హై డిమాండ్... 44 నిమిషాల్లో 2.20 లక్షల టికెట్లు ఖాళీ

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో వుంచగా.. కేవలం 44 నిమిషాల్లోనే 2.20 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని టీటీడీ తెలిపింది. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని తెలిపింది. 

tirumala vaikunta ekadasi tickets sold within 44 miniuts
Author
First Published Dec 24, 2022, 9:14 PM IST

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిపురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎంతోమంది అనుకుంటారు. ఆ రోజు తమ పలుకుబడిని ఉపయోగించి దర్శనానికి పోటెత్తుతారు. అయితే విమర్శల నేపథ్యంలో టీటీడీ ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో వుంచగా.. కేవలం 44 నిమిషాల్లోనే 2.20 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని టీటీడీ తెలిపింది. టికెట్ల కొనుగోలు చేసేందుకు ఒకేసారి 2 లక్షల 50 వేల మంది వెబ్‌సైట్‌ని సందర్శించారని.. అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని టీటీడీ వెల్లడించింది. 

జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి...శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను వుంచింది టీటీడీ. ప్రత్యేక ప్రవేశం నిమిత్తం 20 వేలు, సర్వదర్శనం కోసం రోజుకు 50 వేల టికెట్లను కేటాయిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అన్ని ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. శ్రీవాణి టికెట్లు పొందిన వారికి మహా లఘు దర్శనం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. అలాగే డిసెంబర్ 29 వ తేదీ నుంచి జనవరి 3 వరకు గదుల రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. 

ఇదిలావుండగా.. టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం శ్రీవారి బంగారు వాకిలి వద్ద సింఘాల్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. 12 రోజుల పాటు సింఘాల్ టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా విధులు నిర్వర్తించనున్నారు. తన కుమారుడు చంద్రమౌళి రెడ్డి గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవులో వున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘాల్‌కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 

కాగా... ఇటీవల గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ధర్మారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక, చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే సివిల్స్ పరీక్షలకు కూడా సిద్దం అవుతున్నాడు. ఇటీవలే చంద్రమౌళి రెడ్డి చెన్నై పారిశ్రామికవేత్త ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమయింది. వచ్చే నెల వీరి వివాహం జరగాల్సి ఉంది. ఆలోపే ఆయన ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios