క్షురకులకు రూ.20 వేల కనీస వేతనం, ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ .. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి సమావేశం మంగళవారం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. క్షురకులుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి నెలకు రూ.20 వేల కనీసం వేతనం, పెద్ద జీయర్ మఠానికి ప్రతి ఏటా రూ.60 లక్షలు, చిన్న జీయర్ మఠానికి రూ.40 లక్షల అదనపు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి సమావేశం మంగళవారం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. అలాగే టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. తిరుమల కళ్యాణ కట్టలో క్షురకులుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి నెలకు రూ.20 వేల కనీసం వేతనం అందించాలని నిర్ణయించింది. టీటీడీలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తోన్న పోటు కార్మికులకు రూ.10 వేల వేతనం పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీని వల్ల సుమారు 350 కుటుంబాలకు మేలు జరుగుతుందని అంచనా . వీరితో పాటు వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్స్‌గా గుర్తించి వేతనాలు పెంచాలని బోర్డు నిర్ణయించింది.
పెద్ద జీయర్ మఠానికి రూ.60 లక్షలు, చిన్న జీయర్ మఠానికి ప్రతి యేటా రూ.40 లక్షల అదనపు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మఠాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఉద్యోగ భద్రత కల్పించాలని పాలకమండలి తీర్మానించింది. టీటీడీలోని మిగిలిన శాఖల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ.3 వేల చొప్పున వేతనం పెంచాలని నిర్ణయించింది. దీని వల్ల దాదాపు 2 వేల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో గతంలో ఉద్యోగులుగా పనిచేసిన వారికి గురువారం ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. మరో 1500 మందికి కూడా త్వరలోనే స్థలాలు కేటాయిస్తారు. ఫిబ్రవరి నాటికి 350 ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందుకోసం రూ.80 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది. అంతకుముందు గోవింద నామకోటి పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. అలాగే 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను కూడా ఆయన ఆవిష్కరించారు.