తిరుమలలో పట్టుబడిన చిరుత బాలికపై దాడిచేసిందేనా? కాదా? తెలియాలి : డీఎఫ్‌వో శ్రీనివాసులు
Tirumala : తిరుమలలో పట్టుబడిన చిరుత.. బాలికపై దాడిచేసిందేనా? కాదా? అనేది తెలియాల్సి ఉందని టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసులు అన్నారు. అలాగే, చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు ఉన్నాయా? లేవా? గుర్తించాల్సి ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tirumala Cheetah: తిరుమలలో పట్టుబడిన చిరుత బాలికపై దాడిచేసిందేనా? కాదా? అనేది తెలియాల్సి ఉందని డీఎఫ్‌వో శ్రీనివాసులు అన్నారు. అలాగే, చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు ఉన్నాయా? లేవా? గుర్తించాల్సి ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకెళ్తే.. శుక్రవారం ఆరేళ్ల లక్షిత తన తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు వచ్చింది. అయితే, నెల్లూరు జిల్లాకు చెందిన ఆ కుటుంబం కాలినడకన శ్రీవారిని దర్శించుకోవాలని భావించింది. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గంలో వారంతా నడుస్తున్నారు. నడుస్తున్న క్రమంలో లక్షిత వారి కంటే వేగంగా ముందుకు వెళ్లింది. తరవాత కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే గాలింపు చర్యలు చేపడితే లక్షిత తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. దీంతో బాలికపై చిరుత దాడి చేసి చంపేసిందని అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలోనే చిరుతను పట్టుకోవడానికి బోను ఏర్పాటు చేసిన అధికారులు.. తిరుమలలో నాలుగు రోజుల కిందట ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిందని తెలిపారు. ఆ చిరుత తిరుమల నుంచి అలిపిరికి కాలినడకన వెళ్లే మార్గంలో ఉన్న బోనులోకి వెళ్లింది.
ఈ క్రమంలోనే టీటీడీ డీఎఫ్ వో శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. బోనులో పడిన చిరుత బాలికపై దాడి చేసిన చిరుతనేనా? లేక వేరేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు. దీని కోసం అన్ని పరీక్షలు జరుపుతామనీ, చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్ల గురించి తెలుసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై నిర్ణయం వచ్చిన తర్వాత ఆ చిరుతను జూ పార్కులోనే ఉంచాలా? లేదా ఆడవిలో వదిలిపెట్టాలా అనే విషయం పై నిర్ణయం తీసుకుంటామన్నారు. బోనులో చిక్కిన చిరుత వయస్సు నాలుగు సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.
అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయినట్టు గుర్తించిన ప్రాంతం, చిరుత పట్టుబడిన ప్రాంతం ఒక్కటేనని తెలిపారు. ఒక్కటే కాకుండా మరికొన్ని చిరుతలు సైతం ఈ ప్రాంతంలో సంచారిస్తున్నాయని ఫారెస్టు అధికారులు గుర్తించారనీ, అన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఆపరేషన్ చిరుత కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
చిరుత దాడి నేపథ్యంలో నడకదారిలో వెళ్లే భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భక్తుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులను గుంపులు గుంపులుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వారి రక్షణ కోసం ప్రత్యేక ఫోర్సును సైతం ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. తిరుమల నడక మార్గంలో చిరుతల దాడుల నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతిని ఉండదని టీటీడీ అధికారులు తెలిపారు.