Asianet News TeluguAsianet News Telugu

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు ప్రాణస్నేహితులు దుర్మరణం

ఎప్పుడూ కలిసేవుండే ముగ్గురు ప్రాణస్నేహితులు చాావులోనూ అలాగేవున్నారు. కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. 

Three youngsters death in road accident in Kakinada AKP
Author
First Published Jun 9, 2023, 2:49 PM IST

కాకినాడ : స్నేహితుడి వివాహానికి బైక్ పై బయలుదేరిన ముగ్గురు యువకులు రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వేగంగా దూసుకెళుతున్న బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణస్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు. కాకినాడ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురం కు చెందిన కిరణ్(23), శివప్రసాద్(20), వీరబాబు(21) ప్రాణ స్నేహితులు. ఎక్కడకి వెళ్ళినా ఈ ముగ్గురూ కలిసే వుండేవారు. ఇవాళ అన్నవరంలో ఓ స్నేహితుడి పెళ్లి వుండటంతో గత రాత్రే ముగ్గురూ బైక్ పై బయలుదేరారు. అయితే కాకినాడ జిల్లామీదుగా వెళుతుండగా ముసలయ్యపేట వద్ద వీరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 

రాత్రి ప్రయాణం కావడంతో రోడ్డుపై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో బైక్ ను వేగంగా పోనిచ్చారు. దీంతో హటాత్తుగా ఓ ట్రాక్టర్ అడ్డురావడంతో బైక్ నియంత్రించలేక అదే స్పీడ్ లో ఢీకొట్టారు.దీంతో కిరణ్, వీరబాబు అక్కడిక్కడే మృతిచెందారు. శివప్రసాద్ తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. 

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. స్పాట్ లోనే చనిపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాలపాలైన శివప్రసాద్ ను కూడా మొదట తుని హాస్పిటల్ కు తరలించారు. అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందారు. 

Follow Us:
Download App:
  • android
  • ios