అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలో  ముగ్గురు వృద్దులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఈ ఇంటి నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి చూస్తే మూడు మృతదేహలు లభ్యమయ్యాయి.

పెనుకొండ పట్టణంలోని వేణుగోపాలస్వామి గుడి సమీపంలోని ఇంటి నుండి దుర్వాసన వస్తున్న విషయాన్ని మంగళవారంనాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే జిల్లాలోని మడకశిరలో ఓ బ్యాంకులో పనిచేసి రిటైరైన  అశ్వర్థప్ప  తన ఇద్దరు చెల్లెళ్లు ఈ ఇంట్లోనే నివాసం ఉండేవారు. వయసు మీద పడడంతో పాటు కరోనా సమయంలో వీరికి సహాయం చేసేవారు లేరు.

దీంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  మృతదేహల వద్ద క్రిమి సంహారక మందు సీసాలు పడి ఉన్నాయి. ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.