వారు ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఉపాది నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. అయితే సంక్రాంతి పండగ పూట కుటుంబాలతో ఆనందంగా గడపడానికి సొంతూళ్లకు చేరుకున్నారు. ఇలా ముగ్గురు కలిసి సరదాగా గడపడానికి మోటార్ సైకిల్‌పై వెళుతుండగా లారీ రూపంలో మృత్యువు వారికి  కబళించివేసింది. ఈ విషాదం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

నెల్లూరు జిల్లా జంగాలదొరువు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నార్త్‌రాజుపాళెం గ్రామానికి చెందిన నన్నెసాహెబ్, ఊచగుంటపాళెంకు చెందిన రాములు ప్రాణ స్నేహితులు. వేరు వేరు గ్రామాలను చెందిన వీరు చదుకునే నాటి నుండి కలిసి మెలిసి వుండేవారు. పెళ్లయి వేరు వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నా వీరి స్నేహం అలాగే కొనసాగుతోంది. 

సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గురు స్నేహితులు కుటుంబాలతో కలిసి స్వగ్రామాలకు వచ్చారు.. ఈ సందర్భంగా వీరు కలుసుకుని సరదాగా పడపాలనున్నారు. ఇందుకోసం ముగ్గరూ ఒకే బైక్ పై సమీపంలోని నెల్లూరు పట్టణానికి బయలుదేరారు. మార్గమధ్యలో ముంబై రహదారిపై ప్రయాణిస్తున్న వీరి వాహనాన్ని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.  

పండగ పూట తమ వారిని కోల్పోయిన కుటంబ సభ్యుల రోదనలతో సంఘటనా స్థలం వద్ద విషాదం అలుముకుంది. చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులుగా మెలిగిన ముగ్గురు చావును కూడా కలిసే పంచుకోవడంతో గ్రామస్తులు, తోటి స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో వున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.