తెలంగాణ ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్యోగులకు కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, క్రమబద్దీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ అయిన 12 మంది ఉద్యోగుల్లో వివాదం కొలిక్కివ‌చ్చింది. వారికి అనుకూలంగా ఈరోజు సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కోర్టుకు వ‌చ్చిన ఉద్యోగుల ఖ‌ర్చులు భ‌రించాల‌ని ఆదేశించింది. ప్ర‌తీ అభ్య‌ర్థికి రెండు రాష్ట్రాలు ప‌దివేల రూపాయిల చొప్పున అందజేయాల‌ని చెప్పింది. ఈ విష‌యంలో కోర్టుకు రాని వారికి కూడా పోస్టింగ్ ఇవ్వాల‌ని చెప్పింది. వారిని వెంట‌నే క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని, పెండింగ్ జీతాలు 3 వారాల్లోపు చెల్లించాల‌ని తెలిపింది. 

పశ్చిమ గోదావరి జిల్లా జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు: తొమ్మిది మంది మృతి
1999 సంవత్స‌రంలో ఉమ్మ‌డి ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన నోటిఫికేష‌న్ ద్వారా ఉద్యోగాలు పొందిన ప‌లువురు గ‌తంలో ప‌లు అంశాల‌పై సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. అందులో నుంచి 12 మందిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ ఆ స‌మ‌యంలో కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్ర‌కారం ఏపీ వారిని రిలీవ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కానీ వారిని తెలంగాణ ప్ర‌భుత్వం విధుల్లో చేర్చుకోలేదు. దీంతో మ‌ళ్లీ వారంతా సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. వీరి త‌రుఫున అనుమోలు వెంక‌టేశ్వ‌ర‌రావు వాద‌నలు వినిపించారు. దీంతో వారికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వారిని వెంట‌నే విధుల్లో చేర్చుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.